అప్పటికి నాలుగోసారి తలదువ్వడం, వెళ్ళి  నీళ్ళతో జుట్టును తడపడం. మళ్ళీదువ్వడం, రకరకాల హెయిర్ స్టైల్స్ మార్చడం, కానీ ఏదీ నచ్చడంలేదు. అతని పేరు రామ్. టెన్త్ క్లాసు పూర్తిచేసి ఇంటర్ గవర్నమెంటు కాలేజ్ లో జాయిన్ అయ్యి రెండు రోజులయ్యింది. కాలేజి ఇంటికి దగ్గరకావటంతో నడిచేవెళుతుంటాడు. టైమ్ అయ్యేంతవరకూ తలదువ్వతూనే ఉంటాడు. అద్దం ముందు రోజుకు కనీసం నాలుగు గంటలు గడపనిదే అతనికి ఆరోజు ఏదో వెలితిగా ఉంటుంది. రామ్ వాళ్ళమ్మ వంట పనులు కానిస్తూ, టిఫిన్ బాక్స్ రడీ చేస్తూ ఓరకంటితో రామ్ ని గమనిస్తూనే ఉంది. టైమవుతుంది అని చెప్పి చెప్పి విసుగుపుట్టి మానేసింది ఇక చెప్పడం. టైమ్ చూసాడు, 9:00 అయ్యింది. కాలేజ్ కూడా 9:00 కే. ఉలిక్కిపడి బుక్స్ చేత పట్టి, ఒకసారి మళ్ళీ అద్దంముందు క్రాఫ్ సర్దుకుని వంటగదిలోనికి పరుగుతీసాడు. “అమ్మా! నువ్వెప్పుడూ లేటే, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ రెండూ ఒకచోట పెట్టొచ్చుగా”, అన్నాడు చిరాకుగా లంచ్ బాక్స్ చేతపట్టుకుని. ఆమెవంక చూడకుండానే పరుగుతీసాడు. చూస్తే పెద్దక్లాసు ఉంటుందని తెలుసు అతనికి.


                  క్లాస్ వెనుక డోర్ నుండి శబ్దంరాకుండా వచ్చి కూర్చున్నాడు. సార్ ఏదో సీరియస్ గా.. టీటాలు, ఇంటిగ్రల్స్ తో ఏవో పెద్ద పెద్ద లెక్కలు బోర్డ్ పై రాసేస్తున్నారు. ఆయన లెక్కమొదలుపెట్టేటపుడు అయిదుగురో ఆరుగురో ఉంటారు క్లాసులో, పూర్తయ్యేసరికి మెత్తం ముప్పయ్ మందితో నిండిపోతుంది క్లాసంతా. కానీ.. తెలిసినా లేటేంటని ఎవరినీ నిలదీయరు పాపం, ఆయన పనేదో ఆయనదే.
రామ్ తన ఫ్రెండ్ వైపు చూసి ఏదో సైగ చేసాడు.  ఫ్రెండ్ తల ఊపి, నేనున్నాగా అన్నట్లు సైగ చేసాడు.  హమ్మయ్య అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు రామ్. ఇంతకీ  విషయం అటండెన్స్.  ఒకడు వస్తేచాలు, మెత్తం ముప్పయిమందికీ  పలికే టేలెంట్  వున్నవాళ్ళు  ఉన్నారు క్లాసులో.
మూడు అవర్స్ అయిపోయాయ్ లంచ్ కి బయలుదేరారు అందరూ. కబుర్లతో, జోకులు, నవ్వులతో ముగిసింది లంచ్. ఇక అవర్స్ ఏమీ ఉండవ్ ఆ రోజుకు.. ఉన్నా ఎప్పుడో ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయ్ తప్ప,. లేకపోతే ఆటలాడటం, కబుర్లు, ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవటంతో రోజు గడుస్తుంటుంది.

“ఒరే రేపు తేజ సినిమా రా!.. టికెట్స్ సంపాదించరా, అందరికీ!, .. మార్నింగు షో”, అని చెప్పాడు రామ్.
“ఒరే! రేపు ఫిజిక్స్ క్లాసురా బాబు.., సార్ చంపేస్తారు అందరం క్లాసుకి రాకపోతే”,అని భయంగా అన్నాడు వెంకట్.
“పర్లేదురా, ఆయన క్లాసు మళ్ళీ మూడు రోజులు లేదు, గుర్తుండదులే.. మర్చిపోతారుల్లే, ఆయన ఇంటి దగ్గర ట్యూషన్స్ ,టెన్సన్స్.. ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయ్. నువ్యు మాత్రం మర్చిపోకు, టీవీలో యాడ్ చూపిస్తున్నాడు, సోలిడ్.. ,హీరోయిన్ కొత్త, హీరో కొత్త.. ఆర్పీ సాంగ్స్. ఖచ్ఛితంగా ఒక మాస్ మషాళా సాంగ్ ఉంటుంది. ఇక డాన్సులే డాన్సులు…ధియేటర్లో… కుమ్మేద్దాం”, అన్నాడు రామ్.
           సినిమా చూడటమూ అయ్యింది, ఫిజిక్స్ సార్ చేత క్లాసులో తిట్లుతినటమూ అయ్యింది. రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వారం రోజుల్లో తొమ్మిదిసార్లు అదే సినిమా చూసేసారు. పాపం రామ్ నాలుగుసార్లే  చూడగలిగాడు.. ఎందుకంటే, ఫస్ట్ షోలకీ, సెకండ్ షోలకీ వెళ్ళడు.. ఇంట్లో వాళ్ళ నాన్నకి భయపడి.
                                                           ****************
                 “ఒరే!.. ఆపరా ఎక్కడికో చెప్పవ్.. ఎందుకింత దూరం.. ఏమన్నా అడిగితే మాట్లాడాలంటావ్.. ఏంటి విషయం”, స్పీడుగా బైకు నడుపుతున్న రామ్ ని అడిగాడు వెంకట్.  ప్రక్కనే ఉన్న టీ షాప్ దగ్గర ఆపాడు బైక్ ని.  పార్క్ చేసి లాక్ వేసి, కీస్ వెంకట్ చేతికిచ్చి..టీ ఆర్డర్ చెప్పి.. మూలగా ఉన్న టేబుల్ పై కూర్చున్నారిద్దరూ.
వెంకట్ జేబులోంచి సిగరెట్ ప్యాకట్ తీసుకుని సిగరెట్ వెలిగించి చెప్పడం మెదలుపెట్టాడు రామ్.
“ఏంలేదురా.. అందరికీ గాళ్ ఫండ్స్ ఉన్నార్రా. నాకూ లైఫ్ భోర్ కొడుతుంది. ఈ మధ్య ఆ స్వప్నకి బాగా ఎట్రాక్ట్ అయిపోతున్నా కూడా.. ప్రపోజ్ చేద్దామనుకుంటున్నా.. నువ్వేమైనా సలహా ఇస్తావని నిన్ను అడుగుతున్నా”, అని అసలు విషయం చెప్పాడు రామ్..
“ఓహో!.. అనుకున్నా తమరు ఇలాటిది ఏదో నడుపుతున్నారని.. ఈ మధ్య ఆ అమ్మాయితో జోకులు, నవ్వులు.. చూస్తున్నాగా.., మరి.. ఇంకే.. కానీయ్..నేనున్నాగా.  బట్.. డేంజర్రోయ్.. అది వాగుడుకాయ్.. నీ జేబులు ఖాళీ కూడా.. , దేనికీ సిగ్గు పడదు.., మొన్న రెండుసార్లు సినిమా టికెట్స్ నేనే తీసానా!!.. తరువాత డబ్బులు అడుగుతుంటే..ఏ డబ్బులు అంటుందే తప్ప ఇవ్వదే!… నాకింక విసుగుపుట్టి అడగటం మానేసా.. ఇంకా ఏమైనా అంటే మా నాన్నకి అంతవుంది, ఇంతవుంది.. కారువుంది అని కబుర్లు.. చెబుతుంది. పర్స్ లో ఎప్పుడూ పదిరూపాయలుండవ్..!!,  జాగ్రత్తరా మరి”, అన్నాడు వెంకట్ రామ్ తో.
“అవన్నీ నే చూసుకుంటాలేరా.. ఛీ ఆ నల్లశీనుగాడు కూడా.. గాళ్ ఫ్రెండ్ ని మెయింటేన్ చేస్తున్నాడ్రా..! మనకులేకపోతే అవమానకరం.. నేను మేనేజ్ చేస్తాగా.. నువ్వు నాకు సలహా ఇస్తుండు అంతే!!”, అన్నాడు ధీమాగా రామ్.
                                                       ****************
             “రోజూ వందలు వందలు నేనేక్కడ తెచ్చిచ్చేది.. వెళ్ళి మీ నాన్ననడుగు. మొన్నేకదా ఏవో బుక్స్ అన్నావ్.., ట్యూషన్ ఫీజులన్నావ్”, అని చిరాగ్గా చెప్పింది రామ్ తో వాళ్ళమ్మ.
“ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయమ్మా.. ఈ బుక్స్ కొనుక్కోవాలి మరి.. ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు.. ఇన్ని డబ్బులు అంటే..? నేనేమన్నా దాచుకుంటున్నావనుకుంటున్నావా?, సినిమాలకి వెళ్ళే డబ్బులు నీకు చెప్పే తీసుకుంటాగా.. ఇవి బుక్స్ కి అంటే నమ్మవే.?.” అని అలిగి తన గదిలో వెళ్ళిపోయాడు.
కొంతసేపటికి అమ్మడబ్బులతో వస్తుందని తెలుసు. అలాగే జరిగింది కూడాను!!.

               ఎలాగైతే స్వప్నతో ఐస్ క్రీమ్ పార్లర్ల వెంట తిరగటం, సినిమాలు షికార్లు కొట్టడం అలవాటయిపోయింది. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.. కానీ రామ్ కి అసలు చదువుపై ధ్యాసే వుండటంలేదు ఎప్పుడూ  స్వప్నగురించే ఆలోచన.. ఎలా తనని  మెప్పించి ఎలా తన దగ్గర గొప్పగా పేరు సంపాదించాలన్న తపన, అనవసరపు ప్రేలాపనలు,కబుర్లు చెప్పడంలో కాలం గడుస్తుంది. ఆ అమ్మాయి ఐస్ క్రీములు తిని లావవుతుంది. రామ్ కి ఇంట్లో డబ్బులు తీసుకునే ప్రతిరోజు ఒకగండంలా గడుస్తుంది.
తనకు సంభందించిన  ఖర్చులన్నీ తగ్గించేసాడు పాపం..

     ఒకప్పుడు టీవీలో యాడ్ చూసి, “అమ్మాయిలంతా వెనక పడే..” డియోడరెంట్ స్ప్రే వాడేవాడు.. కొంత కాస్ట్లీ అయినా… ,కానీ అమ్మాయిలు టీవీలో చూపించినట్లు వెనుక పడ్లేదు!,పాపం.  ఇప్పుడు చేతిలో డబ్బులులేక మొత్తం స్ప్రే వాడటమే మానేసాడు!!, మొత్తం డబ్బులన్నీ స్వప్న ఖర్చులకే సరిపోతున్నాయి. ఆ అమ్మా యి ఎప్పుడూ చేతిలో పర్సు పట్టుకుని తిరుగుతుంది తప్ప, పర్సులో ఏముంటుందో  ఎప్పుడూ చూడలేదు రామ్.. బిల్ రాగానే, నేనిస్తా అని పర్స్ పై చెయ్యివెయ్యడం, రామ్..వద్దు నేనిస్తా అని బిల్ పే చేయటం.. మాములైపోయింది.. కానీ ఇప్పుడు నువ్వే పే చెయ్యి అన్నట్లుగా అసలు పర్స్ పైన చెయ్యికూడా వేయడంలేదు కనీసం. పార్లర్ వాడు కూడా రేట్లు పెంచేసాడు. ఏదో ఎవరికీ కనపడని చోట వుందికదా అని , అక్కడికే వెళ్ళక తప్పడంలేదు రామ్ కి.

                                                                      ****************

                         పరీక్ష రిజల్ట్స్ రానే వచ్చాయి, ఒక్కసారిగా రామ్ మొహం వెలిగిపోయింది రిజల్ట్స్ చూసి. రేపు ఎగ్జామ్ అనగా కూడా పుస్తకం తీయకుండా, అసలు టెన్సన్ పడకుండా వ్రాసాడు పరీక్షలు. అతనికి  తెలుసు ఈ సారి కనీసం ఐదు సబ్జక్ట్స్ ఉంటాయని, కానీ లక్కు కొద్దీ మూడు మిగిలాయి…మిగతావి ఏవో పాస్ మార్కులతో గట్టేక్కాసాయి. చాలా లక్కీగా అయిపోయాయే సబ్జక్ట్స్ ఆశ్చర్యం అనుకున్నాడు మనసులో రామ్.
ఇప్పుడు మూడు సబ్జక్ట్స్ ఉన్నాయని ఇంట్లో ఎలా చెప్పాలా అన్న ఆలోచన మనసులోకి రాగానే.. టెన్సన్ మొదలయ్యింది. అమ్మో!, నాన్నకి తెలిస్తే.. చంపేస్తారు.
రామ్ కి వాళ్ళ మావయ్యతో మంచి చనువు వుంది, వాళ్ళమ్మకి సొంత తమ్ముడే అయినా ఆయన చాలా సరదాగా వుండే మనిషి. కానీ ఆయన ప్రస్తుతం ఊళ్ళో లేకపోవడంతో రామ్ కి టెన్సన్ ఎక్కువైంది..
“ఇప్పుడు నాన్నకి ఎవడో వెధవ బజారులో చెప్పేస్తాడు రిజల్ట్స్ వచ్చాయని.. అప్పుడు నన్ను పిలిచి అడిగేస్తారు..ఆయన ముందు ఏదీ దాచలేం.. చెప్పక తప్పదు నిజం.. ముందే చెప్పేస్తే కొన్ని తిట్లు తగ్గుతాయి..” అని రామ్ ఆలోచిస్తున్నాడు. ఇక ఈరోజే ..ఏదోలా అమ్మకి చెప్పేయడం మంచిదని నిర్ణయించుకున్నాడు.

ఇంటికి త్వరగా చేరుకున్నాడు. అమ్మ వంట గదిలో ఉందని తెలుసుకుని.. బుక్స్  తన గదిలో పడేసి నెమ్మదిగా వంటగదిలోకి చేరుకున్నాడు. ఇవ్వాళ త్వరగా వచ్చేసావేంటి?,అంటే.. ఏదో కధ చెప్పి కవర్ చేసుకున్నాడు. వాళ్ళమ్మ కూరగాయలు కోయడంలో నిమగ్నమైవుంది. అవసరమున్నా లేకున్నా ఏదొక విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడే ఉన్న క్యారెట్ తీసుకుని కరకరా నములుతూ ఫ్రెండ్స్ విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. విషయంలో అంత నవ్వులేకపోయినా బిగ్గరగా నవ్వటం, మళ్ళీ అమ్మ వంక చూసి ఆమె నవ్వకపోయేసరికి నవ్వుఆపేసి  వేరే టాపిక్ మార్చడం చేస్తున్నాడు రామ్. వాళ్ళమ్మ మాత్రం ఊ అనటం తప్ప ఏమీ సమాధానం లేదు.  ఇక చెప్పటానికి ఏమీలేవన్నట్లు అయ్యింది రామ్  పరిస్ధితి.

ఉలిక్కి పడేంత శబ్దంతో విజిల్ వేసింది కుక్కర్.  అలా నాలుగు విజిల్స్ వేసే సరికి అమ్మ గ్యాస్ స్టౌ దగ్గరకు వెళ్ళడానికి లేవబోవడం గమనించాడు రామ్.  గబుక్కున కూర్చున్న చోటు నుండి లేచి గ్యాస్ స్టౌ పైనున్న కుక్కర్ ని దించి ప్రక్కనే ఉన్న నీళ్ళ గిన్నె స్టౌపై పెట్టి మళ్ళీ యధాస్ధానానికి చేరుకున్నాడు.. కొంత సేపుమౌనంగా కూర్చున్నాడు.. తరువాత టాపిక్ ఏంటీ? ఎలా మొదలుపెట్టి సబ్జక్ట్స్ విషయంలోకి తీసుకొద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు రామ్ .
“ఏం కావాలి…ఈసారి పెద్దమొత్తంలో డబ్బులుకావాలా?”,అని అడిగింది అమ్మ తన పని చేసుకుంటూనే..
దెబ్బకు షాక్ తిన్నట్లయ్యింది రామ్ కి. ఏంటీ అమ్మ ఇలా అడిగేసింది..??, మనం కాకా పడుతున్నట్లు ఎలా తెలిసిందబ్బా? అని అనుకుంటూనే తటపటాయించుకుని..
“లేదు లేదు.. అటువంటిది ఏం లేదు”, అన్నాడు నసుగుతూ. “డబ్బులు ఏంకాదు.. మరి.. అదీ..!, నా రిజల్ట్స్ వచ్చాయి..”, అని అసలు విషయం చల్లగా చెప్పాడు..

“ఎన్ని సబ్జక్ట్స్ వున్నాయి”, అని అంది అమ్మ. “మూడు ”,అన్నాడు నెమ్మదిగా,నేలచూపులు చూస్తూ.

“సరిగ్గా చదివి వ్రాస్తే, ఇప్పుడు దొంగలాగా చెప్పటం తప్పేది కదా?, నీ బాగుకోసమే కదా? ఎవరుచెప్పినా.. నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవాడివా?, కొట్టి చదివించడానికి. నీ భవిష్యత్తు ఏంటో నువ్వే తెలుసుకుని చదవాలి. మాకుమాత్రం ఏమి తెలుసు..?, మీ నాన్నకు నేను చెబుతాలే.., కాని నువ్యు ఈ సారైనా బాగా చదువు.., లేకపోతే ఒక సంవత్సరం పాడవుతుంది.. ఒక్కసారి చదువు ఆగిందంటే.. ఇక అంతే మరి!!”, అని అమ్మ చెప్పింది.
రామ్ కి గుండెలపైనుండి పెద్ద భారం దింపినట్లైంది. ఆరోజు రాత్రంతా నిద్రలేకుండా ఆలోచించాడు. ఈసారి బాగా చదవాలి అని.. స్వప్నని కలవకూడదని.. ఫ్రెండ్స్ తో సినిమాలు కూడా తగ్గించాలని, కొన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసినట్లు అందరికీ దూరంగా ఉండి చదవాలని భయంకరమైన నిర్ణయాలు తీసుకున్నాడు.

తెల్లవారింది… రామ్ యొక్క మాములు దినచర్య మొదలయ్యింది, రాత్రి వచ్చిన పీడకలలాగా నిర్ణయించుకున్నదంతా వాయిదా వేసాడు… ఆ.. ఇంకా పది నెలలు తరువాత విషయం. ఈ లోపుగా ఎందుకు టెన్సన్ అని తనకి తాను సర్దిచెప్పుకున్నాడు.
                                                                ****************
                       గొప్ప లవ్ జంట అని కాలేజంతా పేరొచ్చేసింది రామ్ ,స్వప్నలకి. ప్రతిరోజులాగే పార్లర్లో కలవాటాలు ఏమీ తగ్గలేదు. “స్వప్నా..!, ఒకటడుగుతాను చెబుతావా?… నేనంటే ఇష్టమేనా..??”, అని అడిగాడు రామ్.
“హా ..!!,  అదేంటి ఇప్పుడు సడెన్ గా ఏమైంది నీకు??”, అంది స్వప్న కనుబొమలు చిట్లిస్తూ.
“ఏమీలేదు..!ఊరికే అడిగా.. ,నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో తెలుసుకుందామని… చెప్పు..?”, అని దూరంగా నిలబడి ఉన్న వెయిటర్ వంక చూసాడు.. ఆర్డర్.. అన్నట్లు.
“రామ్.,ఇంతని చెప్పలేను కానీ.. చాలా!!.. ప్రేమిస్తున్నాను.. DDLJ లో కాజోల్, షారుఖ్ ని ప్రేమించినంతదానికన్నా.. .,  లైలా, మజ్ను సినిమా ఏదీ చూడలేదుకానీ.. వాళ్ళలో అమ్మాయి కూడా ఎవరో తెలియదు..నిజంచెప్పాలంటే.. !!, కానీ.. అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా రామ్…”,అన్నీ సినిమా డైలాగులు బట్టీ పట్టి చెప్పినట్లు చెప్పేసింది స్వప్న.
“నీ ధ్యాసలో పడి నేనసలు ఎగ్జామ్స్ కి సరిగా చదవలేకపోయా తెలుసా.. ??, అందకే మూడు సబ్జక్ట్స్ ఉండిపోయాయి, కానీ నీవి అన్నీ అయిపోయాయి.. ఎలా… ?? ”,అని మాటలు మింగేసాడు.. రామ్.
“అంటే.. సబ్జక్స్ ఉంటేనే ప్రేమ ఉన్నట్లా?”, అని కోపంగా.. అంది స్వప్న.
“లేదు.. లేదు.., అడిగా అంతే.. నేనంటే నీకు ఎంతిష్టమో నాకు తెలుసులే..!”, అని రామ్ కవర్ చేసాడు.
ఇలా వాళ్ళ కబుర్లు సాగుతున్నాయి. వెయిటర్ చిరాకుగా మొహంతో ఆర్డర్ తెచ్చిచ్చాడు.  రామ్ తనని చూడగానే ఆర్డర్ ఏంటో తెలుసు అతనికి.. ఎప్పుడూ ఒకటే అర్డర్.. ఒకటే సమయం.. ఒకటే సినిమా డైలాగులు.. నో టిప్.. , అందుకే అతను మాత్రం ఎంతకాలం భరించగలడు పాపం, ఏమీ చేయలేక రామ్ పై చిరాకంతా.. తన చూపులతో చూపిస్తున్నాడు.

కాలం గడిచింది.. చిగురులు ఆకులుగా మారాయి…

               “ఛీ..!!, ఎవడి భయంలేదు వీడికి.. ఇంకా చిన్నపిల్లాడా??, ఏమైనా.. బుజ్జగించి నచ్చచెప్పడానికి.. మొన్న సబ్జక్ట్స్ తప్పాను అన్నాడు.. ఊరుకున్నా.. వాడే  తెలుసుకుంటాడులే అని… బజారులో సిగరెట్లు కాల్చుతుంటే చూసా..అడిగితే బరితెగించి మరీ కాలుస్తాడని వదిలేసా…ఈరోజు ఒకమ్మాయితో ఇకఇకలు పకపకలు…  ప్రతిరోజు నడుపుతున్నాడంట..!!.ఈ బాగోతం.., బజారులో ప్రతివాడు నాకు చెప్పేవాడే.. వీడిగురించి..!. ప్రేమంట.!!, రేపు దండలువేసుకొచ్చి… నాన్నా!.. నన్ను ఆశీర్వదించండి అంటే..!, ఆశీర్వదించి చిన్న నవ్వునవ్వి వదిలేయాలి వాడిని.. వీడు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు నాకు….”, రామ్ వాళ్ళనాన్న బయటనుండి వచ్చి కాళ్ళుకడుక్కుంటూనే రామ్ గురించి తిట్ల  భారతం మొదలుపెట్టాడు.

 రామ్ వాళ్ళమ్మ ఏమీ మాట్లాడకుండా ఆయన వెనకాలే తిరుగుతూ.. తిట్లన్నీ మౌనంగా వింటూ.. ఆయనకు కావలిసినవన్నీ అందిస్తుంది. వంటగదిలో భోజనం ఏర్పాట్లు చేసింది.. భోజనంచేస్తూ కూడా ఆయన తిట్లు కొనసాగాయి.. భోజనం పూర్తిచేసి చెయ్యితుడుచుకుంటూ అడిగాడు ఆమెను.. “నేను ఏంచేయను నువ్వే చెప్పు..?, పోనీ!, వాడిని స్వేచ్ఛలేకుండా పెంచానా?.. కావలసినవన్నీ ఇచ్చానుగా.. అదే ఇప్పుడు పొరపాటైంది… !”.

తనగదిలోకి వెళ్ళి మౌనంగా పడుకుని ఆలోచనలో పడ్డాడాయన. ఆమె దిగాలుగా హాలులో కూర్చుని ఆలోచించసాగింది.
తన తమ్ముడుకి కబురు పంపించి.. విషయంమొత్తం వివరించింది.. ఎలాగైనా నచ్చచెప్పమని బ్రతిమలాడింది.
“నీకెందుకు..వాడికి నేను చెబుతాగా.. రామ్ మంచివాడు.. వాడిది తెలియనివయసు..అంతే!, చెబితే అర్ధంచేసుకుంటాడు..

నేను చెబుతాగా..వాడికి.. ”,అని భరోసా ఇచ్చాడాయన.

             చల్లని గాలి, పక్షుల కూతలు, అవి సడుస్తున్నప్పుడు వస్తున్న ఎండుటాకుల శబ్దం తప్ప ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా ఉంది. అది రామ్ వాళ్ళ కాలేజి గ్రౌండ్.. రామ్ వాళ్ళ మావయ్వతో కలసి పార్క్ లోని సిమెంటు బల్లపై కూర్చుని ఉన్నాడు..

కొంత సేపు మౌనంగా ఉన్నారిద్దరూ.
            “ఇది కేవలం నువు చేస్తున్న తప్పు కాదు.. నీ వయసు తప్పు.. అందరికీ గాళ్ ఫ్రండ్స్ ఉన్నారు.. నాకూ ఒకరు ఉండాలి అనుకోవడం…, బైక్ పై అమ్మాయిలతో తిరగడం… నేను ఇంత.., నువ్వు ఇంత …అని పోటీపడడం.., ప్రతీది గొప్పకోసం చేసి ఆనందపడడం… అవి ఈ వయసుకు పిచ్చిలాంటివి…, నిజం చెప్పాలంటే.. అమ్మాయిల కి ఆకర్షింపబడడం మీరు ప్రేమనుకోవడం చూస్తే నాకు నవ్వొస్తుంది ఇపుడు… కానీ నీ వయసులో నేనూ అదే నిజం అని నమ్మినవాడినే…, మన మైండ్ మెట్యూరిటీ ఎప్పుడూ ఒకేలా ఉండదు రామ్!..,అది కాలంతోపాటు.. వయసుతో పాటు.. చుట్టూ ఉన్న వాతావరణప్రభావంతోపాటుగా మారుతూ ఉంటుంది. నాకు చిన్నప్పుడు ఉన్న అభిరుచులు ఇప్పుడు లేకపోవచ్చు..!!, ఇప్పుడు వున్న అభిరుచులు రేపు వుండకపోవచ్చుకూడా…!!, ఈరోజు నువు బాగా చేసా!, తిరుగిలేదు! అనుకున్న పని.. రేపు అది చాలా చిన్నది,సులవైనది…. అని నవ్వుతెప్పించవచ్చు.”, అని రామ్ కి మావయ్య.. చెప్పసాగాడు.

            “కాదు మావయ్య.. ఇది ఆకర్షణ కానే కాదు..!, ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.., ఆమె లేకుండా నేను బ్రతకలేనేమో అని అనిపిస్తుంది!!. ఆమె కూడా అంతే.. నేనంటే చాలా ఇష్టం.. ఒక్క క్షణం ఒకరినొదిలి ఒకరు ఉండలేకపోతున్నాం.. , ఇక ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం… ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే… మమ్మల్ని విడదీయాలని ప్రయత్నిస్తే.. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి.. పెళ్ళిచేసుకుందాం అనుకుంటున్నాం…!, నువ్వు చెప్పేవన్నీ నాకు అర్ధమయ్యాయి.., మావయ్యా!, బ్రతకడం కష్టంకాదు.. నేనుకోరుకున్నది వదులుకుని రేపు అది నాకు దక్కకపోయి.. జీవితాంతం భాదపడుతూ బ్రతకలేను… “, అన్నాడు ధీనంగా రామ్.

           “సరే!! ,ఇప్పుడు నిజంగా నీది ప్రేమే.. ఆకర్షణకాదు అనుకుందాం.!!,. అందరిలాకాకుండా నీది అసలైన ప్రేమకధ అని అనుకుందాం.  ఇంట్లోవాళ్ళు నీ బాగుకోరో.. లేక.. ఎందుకో మీ ఇద్దరూ కలవడం ఇష్టలేదనుకుందాం!…,నువ్వు ఏంచేస్తావ్.. దూరంగా పారిపోయి.. పెళ్ళిచేసుకుంటావ్… , అదీ… ఎవరికీ తెలియని చోటుకి.. అక్కడ నువ్వు ఎవరినో బ్రతిమలాడి.. చిన్న ఆవుని పెంచుతావు.. గడ్డి కోసి.., మేపి.. ,ఆ పాలు అమ్మి. . డబ్బులు సంపాదిస్తావ్..!, పొద్దున్నే లేచి వెళ్ళి దగ్గర్లో  ఇళ్ళల్లో పాలప్యాకెట్లు , పేపర్లు సప్లై చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తావ్… , మీ ఇద్దరూ కష్టాలను జయించి… జీవితాన్ని పోరాడుతున్నారనుకుంటూ.. సరదాగా ఒక పాట పాడుకోవడం.. ఈ లోగా వాళ్ళ నాన్నో .. మీ నాన్నో కొందరు మనుషులని పంపిస్తే వాళ్ళతో నువ్వు ఫైట్ చేయడం…,లేదా.. మీ ఫ్రండ్స్ అంతా కలిసి మిమ్మల్ని రక్షించడం.. కాలేజంతా కలిసి.. యూత్ తలచుకుంటే.. ఏదైనా సాధ్యం!, అని చాటిచెప్పడానికి… ఇది సినిమాకాదు రామ్… , జీవితం… నిజ జీవితంలో ఇలా జరిగిన సంఘటనలు నాకు చెప్పు… వాళ్ళల్లో ఎవరైనా జీవితాన్ని సాధించి.. హేపీ ఎండింగ్.. ఉందేమో చూపించు. ఇవి బుర్ర సరిగ్గా ఎదగని వాళ్ళో.. డబ్బులకోసమో..!, వాళ్ళ బిజినెస్ కోసమో!, సినిమాలు తీసి యూత్ ని ఆకర్షిస్తారు… అవి ఎంటర్ టైన్ మెంట్ కోసం కానీ!, అవే జీవితానికి అన్వయించుకోవడం తప్పు.
      నీ వయసులో సచిన్, ద్రావిడ్.., జెన్నిఫర్ లోపెజ్, ఎమినెమ్.. ఇలా నీకు నచ్చినవాళ్ళపై విపరీతమైన వెర్రివుండడం.. వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే.. భాద కలగడం.. ఎవరైనా వాళ్ళని కామెంట్ చేస్తే.. వాళ్ళని చంపేయాలన్నంత కోపంరావడం… అది ఈ వయసు నైజం.  చిన్న ఎమోషన్స్ కి కూడా.. పెద్దగా రియాక్షన్స్ రావడం… అది.. ఈ వయసులో నీ శరీరంలో జరిగే మార్పులవలన.

నీ ఇంటర్మీడియెట్ వయసు..నీ జీవితానికి ఎంతో విలువైనది..!, ఈ రోజు తీసుకున్న నిర్ణయం నీ జీవిత లక్ష్యంపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుంది. నీ వయసుకున్న వేడిని, ఉత్సాహాన్నీ.. నీ చదువుపైనో.. లేక నీ అభిరుచిపైనో పెట్టి.. అందరిలా కాకుండా.. సృజనాత్మకతో.. , నీదైన శైలితో జీవితాన్ని గెలిచి.. స్ధిర పడి.. ,అందరికీ చూపించు నీ సత్తా ఏంటో.
అప్పుడు నీక్కావలసినవన్నీ నీ దగ్గరకే వస్తాయి. అప్పటికీ!!, నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోకపోతే.. పెళ్ళిచేసుకో.
గుర్తుంచుకో.. ఆ సినిమాలలో చూపించినట్లుగా, జీవితానికి లక్ష్యం ప్రేమమాత్రమే కాదు…”, అని రామ్ కి నచ్చచెప్పాడు మావయ్య..

                                                        ****************
 
                     అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ సెలవుపై ఇంటికి వచ్చిన రామ్ తన మావయ్యతో కబుర్లు చెబుతూ.. తన చదువుకునే రోజులు గుర్తొచ్చి నవ్వొచ్చింది… ఆ రోజు మావయ్య నాకు చెప్పకపోయుంటే.. తన లైఫ్ ఏమైపోయేదో.. అని ఆలోచిస్తూ తన చెంపపైకారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ.. మావయ్యకోసం తెచ్చిన వాచ్, ఐపోడ్ తో బాటుగా.. పెద్ద కవర్లో పేక్ చేసిన గిఫ్ట్ మావయ్య చేతికి అందించాడు.
“ఏమిట్రా.. ఇదీ!!”, అని ఆనందంతో అందుకుని ఆ గిఫ్ట్ ని విప్పసాగాడాయన.
సింధూరవర్ణంతో మిలమిల మెరిసిపోయే సూర్యుడి చిత్రపటం అది… ,కుడివైపు దిగువన ఏవో చిన్న అక్షరాలతో వ్రాసి ఉంది.. , మావయ్య కళ్ళజోడు సరిచేసుకుంటూ.. చదివాడు ఆ పదాల్ని.

“నా జీవితానికి వెలుగునింపి, దారి చూపించిన మావయ్యకి ప్రేమతో… రామ్.. “,అని వ్రాసి వుంది.